40 డిగ్రీల ఎండ.. మైనస్‌ 6 డిగ్రీల చలిలో..

‘సినిమాతో పాటు నా పాత్రతోనూ ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా   తెలుగు ప్రేక్షకులు నాకో మంచి విజయాన్ని అందించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిస్కోరాజా’. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహించారు. రజనీ తాళ్లూరి నిర్మించారు. పాయల్‌రాజ్‌పుత్‌, నభానటేష్‌ కథానాయికలు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా కోసం యూనిట్‌ మొత్తం ప్రేమ, త్యాగం, సంతోషంతో పనిచేశారు. రవితేజ ఏడాదిన్నర పాటు సమయాన్ని కేటాయించి చేసిన సినిమా ఇది. నలభైడిగ్రీల ఎండలో, మైనస్‌ సిక్స్‌ డిగ్రీల చలిలో పనిచేశారు. ‘డిస్కోరాజా’ను ఎంతో ప్రేమించారు. నిర్మాత రామ్‌ అసిస్టెంట్‌డైరెక్టర్‌గా, కెమెరా అసిస్టెంట్‌గా ఎలాంటి ఇగోలు లేకుండా సినిమా కోసం కష్టపడ్డారు. సునీల్‌, బాబీసింహా, నరేష్‌తో పాటు ప్రతి పాత్ర ఆకట్టుకుంటున్నది’ అని చెప్పారు.